Saturday, September 3, 2011

బాపు బొమ్మలు


చాలా కాలం తరువాత నాకొక "వానవిల్లు" ఉందనీ, అక్కడ ఏదో వ్రాయాలనీ అనిపించింది. ఈ నెలలోనే బాపు గారి శ్రీ రామరాజ్యం సినిమా విడుదల కానుంది. ఎప్పుడెప్పుడా అని కాచుకొని కూర్చున్నాను నేను. మీరు కూడ ఎదురు చూస్తున్నారనే అనుకుంటున్నా మరి.

అసలు ఈ బ్లాగు వ్రాయడానికి కారణం బాపు గారే. ఒక తెలుగమ్మాయిన్ని వర్ణించాలి అంటే, నాకు తెలిసి, బాగా వాడుకలో ఉన్న వర్ణనలు రెండు - ఒకటి "పదహారణాల తెలుగు అమ్మాయి", రెండు "బాపు బొమ్మలా ఉంది"! అంతలా ప్రభావం చూపారు బాపు గారు మన మీద! ఆయన బొమ్మ గీసినా, కార్టూను వేసినా, సినిమ తీసిన "అదరహో" అనిపిస్తుంది మనకి. అలాంటి బాపు గారి వద్ద హీరోయింగా పని చేయడం అనేది అదృష్టంగా భావిస్తారు మన నటీమణులు. నేను చేసుకున్నా ఒక బుల్లి పరిశోధన యొక్క ఫలితమే ఈ బ్లాగు. అదేంటంటే, ఇప్పటి వరకు ఎందరు హీరోయిన్లు బాపు బొమ్మలుగా నిలిచారు అనేది.

విశేషం ఏంటంటే, బాపు బొమ్మ అనగానే మనకి గుర్తొచ్చే ఆమని, దివ్యవాణి, స్నేహ, జయప్రదల కంటే విజయశాంతి, విజయ నిర్మల వంటి వారే బాపూ బొమ్మలుగా ఎక్కువసార్లు తెరపై కనిపించారు! రాధిక, శ్రీదేవి, మాధురి దీక్షిత్, సుమలత వంటి వారు కూడ బాపు బొమ్మలుగా కనిపించారని నాకు ఈ పరిశోధన ద్వారానే తెలిసింది! ఇక రాబోయే సినిమాలో నయనతార ఎలా నటించిందో మనలని ఎంతగా మెప్పించనుందో చూడాలి మరి!


బాపు బొమ్మల వివరాలు మీరు కూడ చూడండి...
 

నయనతార - శ్రీ రామరాజ్యం
ఛార్మి - సుందరకాండ
ప్రేమ - సుందరకాండ
స్నేహ - రాధాగోపాళం
కావేరి - రాంబంటు
జయసుధ - శ్రీనాథ కవి సార్వభౌమ
ఆమని - మిస్టర్ పెళ్ళాం
దివ్యవాణి - పెళ్ళి పుస్తకం, పెళ్ళి కొడుకు

మాధురి దీక్షిత్
- ప్రేం ప్రతిజ్ఞ (హిందీ)
ఫరా - దిల్జల (హిందీ)
సుహాసిని - జాకి, బుల్లెట్
పూర్ణిమ జయరాం - మంత్రిగారి వియ్యంకుడు
పద్మిని కొల్హాపురి - వో 7 దిన్, మొహబ్బత్, ప్యారీ బెహ్న (హిందీ)
మాధవి - ఏది ధర్మం ఏది న్యాయం

శ్రీదేవి
- కృష్ణావతారం
రీనా రాయ్ - బేజుబాన్ (హిందీ)
రాధిక - రాధా కళ్యణం
కే ఆర్ విజయ - త్యాగయ్య
విజయశాంతి - పండంటి జీవితం, కలియుగ రావణ శూరుడు, పెళ్ళీడు పిల్లలు, కృష్ణావతారం, కళ్యాణ తాంబూలం
సుమలత - రాజాధి రాజు, పెళ్ళీడు పిల్లలు

జ్యోతి - తూర్పు వెళ్ళే రైలు, వంశ వృక్షం
వాణిశ్రీ - భక్త కన్నప్ప, గోరంత దీపం
జయప్రద - సీతా కళ్యాణం, శ్రీ రాజేశ్వరి విలస్ కాఫీ క్లబ్
సంగీత - ముత్యాల ముగ్గు
బి సరోజా దేవి - శ్రీ రామాంజనేయ యుద్ధం
లత - అందాల రాముడు
చంద్రకళ - సంపూర్ణ రామాయణం
విజయ నిర్మల - సాక్షి, బంగారు పిచిక, బుద్ధిమంతుడు

 **
ఇంతకీ "బాపు బొమ్మ" అనగానే మీకు ఠక్కున గుర్తొచ్చేది ఎవరు?
నాకైతే సంగీత, దివ్యవాణి, ఆమనిలు గుర్తొస్తారు! 




images - various sources

Sunday, December 20, 2009

నా తెలుగు పిచ్చి - పాడుతా తీయగా

ఆహా అద్భుతమైన ఫీలింగ్ కలిగింది..."స్వరాలాపనే సరాగాలుగా..." అంటూ ఆ పాట వినగానే. ఎప్పుడో నేను ఆరో తరగతి చదువుతున్న రోజుల్లో మొదటిసారిగా పాడుతా తీయగా అనే ఒక కార్యక్రమం మొదలయ్యింది. ఒక్క ఎపిసోడ్ కూడా మిస్సవ్వకుండా చూసేవాడిని. కేవలం పాడేవారి కోసమే అనుకుంటే పొరపాటే...అక్కడ ఆ పెద్దాయన చెప్పే కబుర్లు, మంచి మాటల కోసం చూసిన రోజులే ఎక్కువ. ఒక రకంగా తెలుగు భాష మీద నాకు ఇంతటి అభిమానం ఏర్పడటానికి ఆయన పాడుతా తీయగాలో చెప్పిన మాటలే కారణం.

అప్పటికే నాకు తెలుగు పిచ్చి బాగా ఉండేది...ఒకమారు, మా ఇంగ్లీషు టీచరైతే మా అమ్మగారికి "వీడిని కొంచెం తెలుగు పిచ్చి తగ్గించుకోమని చెప్పండి, ప్రస్తుతం అంతా బాగానే ఉంది కానీ, మరీ ఇంత పిచ్చి ఉంటే నా సబ్జెక్టుని వీడు నెగ్లెక్ట్ చేసేస్తాడు. ఆ తర్వాత మీ ఇష్టం" అని తేల్చి చెప్పేశారు. ఇంటికొచ్చక మా అమ్మగారు మీ టీచరు ఇలా అన్నార్రా అని చెప్పి "అయినా, నిన్నని ఏం లాభంలే మీ నాన్నగారికి ఉన్న ఆ తెలుగు పిచ్చి నీకు కూడా వచ్చింది...ఎక్కడికి పోతాయి..." అని నిట్టూర్చేసింది. మరే, మా నాన్నగారు తెలుగు మస్టారు అవుదాం అనుకునేవారట ఆ రోజుల్లో...కాని కుదరలేదట. అది అలా ఉండగా, నాకూ, చెల్లి
కీ, ఇద్దరికీ తెలుగు పిచ్చి వంశ పారంపర్యంగా వచ్చేసింది. దానికి తోడు ఈ పెద్దాయన, "ల" కాదమ్మా "ళ" అని పలకాలి..."చలి" లొ చ ని సరిగ్గా పలకాలి, మనం తెలుగు వాళ్ళమవ్వడం మ అదృష్టం, గర్వ పడాలి మనం...అని చెప్తుంటే, అది నా పిచ్చికి పరాకాష్ట అవ్వక మానుతుందా?

ఆ తర్వాత, మా టీవీలో "పాడాలని ఉంది" అని మరో ప్రోగ్రాం చేశారు బాలు గారు. అది నేను, చదువు ధ్యాసలో పడి, అంతగా ఫాలో అవ్వలేకపోయినా, అడపాదడపా చూస్తునే ఉండేవాడిని. దాన్లో కూడా ఈ వారం మంచి మాట అనీ, ఈ వారం పద్యం అని, ఆహా అదరగొట్టేసేవారు. ఆ తర్వాత రకరకాల ఛానల్స్ లో రకరకాల ప్రోగ్రాంలు, రియాలిటీ షోలూ మొదలైపోయాయి. నాకైతే ఒక్కటీ నచ్చేది కాదు. కొంచెం చెప్పుకోదగ్గ
వి అంటే, శైలజ గారు జడ్జిగా వచ్చే షోలు కొంచెం బాగానే ఉండేవి. మరి, ఆ అన్నకి చెల్లెలాయే...అన్నగారంత కాకపోయినా, ఆవిడ తీరు ఆవిడది అనిపించేవారు. గత రెండు మూడేళ్ళుగా అనుకుంటేనే ఉన్నా, బాలూ గారు ఇలాంటి షో ఒకటి చేస్తే బాగుంటుంది అని, మొత్తానికి ఇన్నాళ్ళకి మనకి ఆ అదృష్టం దక్కింది. అయ్యో, ఇంట్లో లేను, ఇక్కడ టీవీ లేదే అని కించిత్ బాధగా ఉన్నా, యూట్యూబ్ నే ఒక సాధనం ఉన్నందుకు సంతోషపడుతున్నాను. కొంచెం ఆలస్యమైనా, ఆ ప్రోగ్రాం చూస్తూ..."తనివి తీరలేదే, నా మనసు నిలువలేదే" అని పాడేసుకుంటున్నాను.

ఇన్నాళ్ళుగా నేను ఏకలవ్య శిష్యరికం చేస్తూ ఆరాధిస్తున్న మా గురువు గారు, ఇక ఈ కొత్త పాడుతా తీయగాలో ఇంకెన్ని కొత్త కొత్త విషయాలు నేర్పిస్తారో వేచి చూడాల్సిందే మరి...

Monday, March 30, 2009

నేనూ..! నా పేరు!!

మొన్నామధ్య నాకో ఈ-మెయిల్ వచ్చింది. వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన కొందరు ఒక దగ్గర సమావేశమై, మా రాష్ట్రం దీనికి ప్రసిద్ధి, మాది దీనికి అని గొప్పలు చెప్పుకుంటున్నారు. మన తెలుగోడి ఛాన్స్ వస్తుంది. వాడు తన పేరు చెప్పేసరికే మిగతా వారంతా మూర్ఛపోతారు! అంత పవర్ ఉంది మరి తెలుగోడికీ, వాడి పేరుకీ....

ఓ వ్యక్తి: నీ పేరేంటి?
నేను: కార్తిక్...
ఓ: ఓహో
నే: తేజో కార్తిక్
ఓ: ......
నే: రాఘవేంద్ర తేజో కార్తిక్
ఓ: ....???...%@్$్
నే: దామ రాఘవేంద్ర తేజో కార్తిక్
ఓ: వామ్మో... (పడిపోయాడు!)


అదన్నమాట సంగతి. నాకు ఈ ఒక్క పేరే ఉందనుకుంటే పొరబాటే. ఇంత పెద్ద పేరుపెట్టి పిలవడం కష్టం కదా! అందుకని దీన్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టి, ఎవరికి నచ్చిన ముక్కతో వాళ్ళు పిలుస్తారు. "తేజో" అనీ, "కార్తిక్" అనీ, "రాఘవ్" అనీ, "రాఘవేంద్ర" అనీ...ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ముక్కలే ఉన్నాయి..!

ఇవి సరిపోవూ అన్నట్టు, ఇంట్లో ఒక ముద్దు పేరు..బయట చాలా మొద్దు పేర్లూనూ. నా క్లోజ్ ఫ్రెండ్స్ "తిక్క" అనీ, స్కూల్ లో కొందరు "కాకి" (నేను నల్లగా ఉండకపోయినా!) అనీ, సీనియర్లు కొందరు "తిక్-కార్" (కార్తిక్‍ని తికమక చేస్తే వస్తుంది ఇది) అనీ, కొందరు "డాక్టర్" (డి ఆర్ నా పేరు ముందుండే ఇనీషియల్స్) అనీ పిలుస్తారు.

నేను ఇంజినీరింగ్ మొదటి సం.లో ఉన్నప్పుడు, మా డిపార్టుమెంటు(ఆర్ట్&డీ) సీనియర్ ఒకావిడ నన్ను నా పేరడిగింది. మొత్తం పేరు చెప్తే పడిపోతుందేమో అని (అసలే కొంచెం బొద్దుగా ఉంటుంది, పడ్డాక భూమి కంపిస్తుందేమో అని భయమేసి), "తేజో కార్తిక్" అని చెప్పాను. ఆవిడ చెవుల్లో ఏం (సీసం) పోసుకుందో ఏమో..."తేజు కార్తిక్" అని వినిపించిందంట. ఇక అంతే, మొదటి ముక్కలో ఆఖరి అక్షరం "జు", రెండో ముక్కలో మొదటి అక్షరం "" కి కలిపి, నాకు ఉన్న పేర్లు సరిపోవన్నట్టు "జుక్క" (అదేదో కుక్క పేరు లాగా!) అని నామకరణం చేసేసింది. ఒక సంవత్సరం పాటు ఆ పేరు వెలుగులోకి రాకుండా ఆపగలిగినా... రెండో సం.లోకి వచ్చేసరికి నా జూనియర్లు, పిలవడానికి వీలుగా ఉంది అని "జుక్క"కి సెటిల్ అయిపోయారు! ఇక నా వల్ల అయ్యేది ఏమి లేక, అప్పటి నుంచి ఎవరెలా పిలిచినా, "పిలిస్తే పలుకుతా" అన్న పాలసి ని ఫాలో అయిపోదాం అని డిసైడ్ అయ్యాను.

అసలు ఈ పేర్లన్నిటికంటే ముందు నాకు ఇంకో పేరు ఉండేది....అదే "శ్రీచంద్" (అదేదో ఉత్తర భారతీయ మార్వాడి పేరు లాగా!). నర్సరీ చదివేటప్పుడు నా పేరు అదే. తర్వాత మా అమ్మ వాళ్ళకి నచ్చలేదో ఏమో, ముషీరాబాద్‍లో ఉడే దైవజ్ఞ శర్మ గారి వద్దకు తీసుకొని వెళ్ళారు. ఆయనేమో నన్ను చూసేసి, రాఘవేంద్ర అని కానీ, తేజో కార్తిక్ అని గానీ పెట్టేయండి అనేశారు. అమ్మ, నాన్న ఇద్దరూ తెలుగోళ్ళే కదా, తెలుగు బుద్ధి ఎక్కడికి పోతుందీ? ఆయన ఇచ్చిన రెండు పేర్లని కలిపి, ఇలా చాంతాడంత పేరు పెట్టేశారు నాకు.

అయితే మా డాక్టరు డా.కోటేశ్వర రావు (పేరుకి పిల్లల డాక్టరే అయినా, మాకు ఫ్యామిలి డాక్టరు!!) గారికి నేను శ్రీచంద్ గానే పరిచయం. ఇంజినీరింగ్ లో జాయిన్ అవ్వడానికి ముందు మెడికల్ సర్టిఫికట్ కోసం వెళ్తే, దాంట్లో నా పేరు "తేజో కార్తిక్ డి ఆర్" అని చూసి షాక్ అయ్యాడాయన. "ఏంటీ టెంత్ క్లాసులో పేరు మార్చేశారా? అయినా శ్రీచంద్ పేరు అంత బాగుండగా మళ్ళీ ఎందుకు మార్చారండి" అని నాన్నని అ(క)డిగేశారు. అప్పుడు నాన్న జరిగిన కథ చెప్తే విని, నవ్వేసి ఊరుకున్నాడాయన! ఇప్పటికీ, ఆయనకి నేను శ్రీచంద్‍నే :)

అదండీ నా (పేరు) కథ!! చూశారా, ఇన్ని పేర్లని మోస్తూ, ఎలా పిలిచినా పలుకుతూ, ఎంత అలసిపోతున్నానో కదా!! ఏం చేస్తాం, కొన్ని తప్పవు అంతే :)

Thursday, March 26, 2009

ఉగాది

యుగాది అంటే కొత్త యుగానికి ఆది అని అర్థం. తెలుగువారికి ఈ పండగతోనే కొత్త సంవత్సరం మొదలవుతుంది. మనకి ఉన్న సంవత్సరాల సంఖ్య అరవై (౬౦-60). రేపటి ఉగాదితో మనము విరోధినామ సంవత్సరంలోకి అడుగు పెడతాము. ఇది ఆ 60 సంవత్సరాల వరుస క్రమంలో ఇరువది-మూడవ సంవత్సరం. ఈ రోజు సర్వధారికి వీడ్కోలు పలికి, రేపు విరోధికి స్వాగతం పలుకుదామా మరి :)

ఉగాది అనగానే ప్రతి తెలుగువానికి మొదటిగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. షడ్రుచులలో మనకి ఎన్నో మంచి చెడులని చూపి, జీవితం అంటే ఎప్పుడూ తీపి మాత్రమే కాదు, ఇంకా చాలా ఉంది అని గుర్తు చేస్తుంది ఈ పచ్చడి. అది ఎలా తయారు చేస్తారో చూద్దాం...

బెల్లం : తీపి
వేప పువ్వు : చేదు
పచ్చి మిరపకాయలు : కారం
చింతపండు : పులుపు
పచ్చి మామిడికాయ : వగరు
ఉప్పు : ఉప్పు
ముందుగా చింతపండుని ఒక పావుగంట నీళ్ళలో నానబెట్టి, కాస్త చిక్కగా రసం తీసుకోవాలి. ఇది మన పచ్చడికి బేస్. దీంట్లోనే మిగతా పదార్థాలన్నీ కలపాలి. బెల్లం, మిరపకాయల్ని సన్నగా తరిగి ఆ రసంలో కలపాలి. మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కోసి వేస్తే బాగుంటుంది. కొందరు మామిడిని తురిమి కూడా వేస్తారు. చిటికెడు ఉప్పు, వేపపువ్వు వేసి కలిపి, దేవుడికి నైవేద్యం పెట్టి ఉగాది పచ్చడిని ఆరగించండి. :)

మరొకసారి అందరికీ విరోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీకు అన్ని విధాలుగా మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను.

Monday, March 16, 2009

మార్చి పదిహేడు

“ఆ అమ్మా! నా వేళ్ళు….తలుపు తియ్యి…తలుపు తియ్యి….” అని అరుస్తుంది సుధ, మా ఇంటి బయట నిల్చొని….
“ఏంటి నాటకాలా??….నువ్వు వెళ్ళేంత వరకు చచ్చినా తీయను ఫో” అని నేను, గడియ వేసిన తలుపు ఎక్కడ తెరుచుకుంటుందో అని తలుపుకి గట్టిగా ఆనుకొని మరీ, అరుస్తున్నాను.
**********
1995, మార్చి, 16వ తారీఖు.

“రేపటికి సరిపడా పప్పు చారు, కూరలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను, కుక్కర్లో అన్నం పెట్టుకుంటే చాలు…” అని అమ్మ నాన్నకి చెప్తుంది....తన పక్కనే బిక్క మొహం వేసుకొని నేను, తను బట్టలు సర్దుకుంటుంటే హెల్ప్ చేస్తున్నా. నాకు ఊహ తెలిశాక ఇదే మొదటి సారి అమ్మ నన్ను వదిలేసి ఊరెళ్ళడం. నా చిన్నప్పుడు ఒకసారి ఇలా వెళ్ళాల్సి వచ్చిందంట. అప్పుడు కూడా నన్ను తనతో పాటు తీసుకొని వెళ్ళింది, తన పొట్టలో. ఇప్పుడేమో ఇలా. ఏదో చెప్పలేని బాధ. చెల్లికి మూడేళ్ళు, ఎంచక్కా అమ్మతో వెళ్తుంది.

“ఉంటావుగా నాన్న? ఒక్క రోజే కదా, మళ్ళీ ఎందుకు అనవసరంగా ప్రయాణం” అని అమ్మ అడిగితే, సరే అని “ఊ” కొట్టాను నేను.

పిన్ని వాళ్ళ అత్తగారు వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకున్నారంట, విజయవాడ దగ్గర ఉయ్యూరు పక్కన ఉండే ఒక పల్లెటూరులో. ఆ ఇంటి గృహప్రవేశానికి వెళ్తుంది అమ్మ. తనని చెల్లినీ, మా బజాజ్ చేతక్ స్కూటర్ మీద, అమీర్‍పేటలో శ్రీ కృష్ణ ట్రావెల్స్ బస్ ఎక్కించి వచ్చాం, నేను నాన్న. స్కూటర్లో నాది ముందు సీటు. డ్రైవింగ్ సీటు అనుకునేరు, ముందు నిల్చుంటాను అంతే…భలే ఉంటుంది అలా నిల్చొని హాండిల్ పట్టుకుంటే…నేనే నడుపుతున్నాను అన్న ఫీలింగ్ కలుగుతుంది....

ఇంటికొచ్చేసరికి పదకొండు దాటింది. మరుసటి రోజు హోలి, సెలవు కాబట్టి లేట్ అయ్యిందన్న టెన్షన్ ఏమి లేకుండా హాయిగా పడుకున్నాను. నేనెప్పుడూ హోలి ఆడిందే లేదు. ఆ రంగులు అవి ఎందుకో నచ్చవు. చర్మానికి ఏమైనా అవుతుందేమో అన్న భయం వల్ల కావచ్చు. ఏదైతే ఏంటి, నాకైతే హోలి అంతగా నచ్చదు అంతే!!

పొద్దునే ఏడింటికల్లా లేచాను. అప్పటికే రోడ్ల మీద అరుపులు, అందరు రంగు నీళ్ళు చల్లుకుంటూ కోడి గుడ్లు టమాటాలతో మారంబీటి ఆడుకుంటున్నారు. మొహం కడుక్కొనే సరికి నాన్న పాలు కాచి ఇచ్చారు, అవి తాగి స్నానం చేసి రెడీ అయ్యి కూర్చున్నా, ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తూ. ఈ లోపల నాన్న కోసం కొంత మంది లంబాడి వాళ్ళు వచ్చారు, “హోలి హోలియొరంగ హోలి…” అని పాటలు పాడుకుంటూ. నాకు భలే ఇష్టం వాళ్ళ పాటలు. వాళ్ళకి హోలి ఈనాం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. నాన్న వాళ్ళతో ఏదో మాట్లాడి ఇచ్చి పంపించేశారు. ఆఫీసులో ఏదో పని ఉందని, తలుపు వేసుకోమని చెప్పి వెళ్ళిపోయారు నాన్న!

మా ఇంటి తలుపుకి గేట్ కి మధ్యలో ఖాళి స్థలం ఉంటుంది. దాంట్లో కూరగాయల మొక్కలు పెంచుకుంటాం – బెండ, వంగ, టమాట మొ||. కాసేపు లోపలే కూర్చున్నా.కాని బోర్ కొట్టి బయటకి వచ్చాను, గేట్ గడియ పెట్టే ఉంది, ఎవ్వరు లోపలికి రారులే అని గుమ్మం ముందు మెట్ల మీద కూర్చున్నా. ఇంకా పిల్లలు, పెద్దలు అందరు హోలి ఆడుతూనే ఉన్నారు…ఈ లోగా మా ఎదిరింట్లో ఉండే ప్రవీణ్ అన్నయ్య పిలిచాడు వాళ్ళ మేడ మీద నుంచి.

“నేను రాను అన్నయ్యా, నాకు ఆడటం ఇష్టం లేదు” అన్నాను.
“ఏమీ కాదు, నీకు ఎవ్వరూ రంగులు పూయకుండా నేను చూసుకుంటాగా! రా పైకి…” అన్నాడు

ప్రవీణ్ అన్నయ్య నాకు మంచి దోస్తు, ఆ మాటకొస్తే పెద్దన్నయ్య ప్రేం, చిన్నతను శివి (శివ) కూడా నాకు మంచి దోస్తులే. మాకు చేదోడు వాదోడుగా ఉంటారు వాళ్ళ ఫ్యామిలి, అన్ని విషయాల్లోనూ.

సరే తను చూసుకుంటాను అన్నాడు, మరీ అన్ని సార్లు అడిగించుకోవడం బాగోదు కదా అని, ఇంటికి గొళ్ళెం పెట్టి జాగ్రత్తగా (రంగులు అంటకుండా) వెళ్ళాను వాళ్ళ మేడ పైకి.

వాళ్ళందరు అక్కడ హోలి ఆడుతున్నారు. మరీ రోడ్డు మీద వాళ్ళ లాగా బీభత్సంగా కాకుండా, ఏదో ఆడాము అంటే ఆడాము అన్నట్టుగా ఆడుతున్నారు. ప్రవీణ్ అన్నయ్య, శివి ఇంకా అదే వీధిలో ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ నాగరాజు వాళ్ళందరితో ఆడుతున్నారు. మహేష్ కూడా ఆడుతున్నాడు.

మహేష్ వాళ్ళు మా ఎదిరింట్లో అద్దెకి ఉంటారు. తను నాకంటే రెండేళ్ళు పెద్దవాడు. తనకి ఒక చెల్లి. పేరు సుధ, నా వయసే కాని నాకంటే ఒక క్లాసు ఎక్కువ. అందుకని కొంచెం టెక్కు కూడా ఎక్కువే. చూడటానికి బక్కగా (చాలా బక్కగా) ఉంటుంది కానీ, మాటలు కోటలు దాటించేది. ఎప్పుడూ నాతో పోల్చుకునేది చదువు, ఆట, పాట అన్ని విషయాల్లోనూ. అన్నిటిలో నేనే ముందు ఉండే వాడిని కనుక, నాకు కూడా ఆ పోలిక నచ్చేది… :) అప్పుడప్పుడు సాయంత్రాలు మా వీధిలో ఉండే ఇసుక గుట్టల మీద ఆడుకునే వాళ్ళం.

వీళ్ళందరు ఇలా రంగులు చల్లుకుంటుండగా సుధ వచ్చింది

“ఏంటీ? నువ్వు ఆడటం లేదు?? నీకు కూడా ఇష్టం లేదా హోలి అంటే??” అని అడిగింది నన్ను వింతగా చూస్తూ..
“ఊహూ…ఇష్టం లేదు…నీకు కూడా ఇష్టం లేదా?” అని ప్రతి ప్రశ్న వేశా నేను..
“లేదు కాబట్టే ఇక్కడ ఉన్నా, ఇష్టం ఐతే అక్కడ ఆడేదాన్నిగా…” అని తనదైన శైలిలో సమాధనం ఇచ్చింది

ఇద్దరం ఏదో మాట్లాడాం కాసేపు, స్కూల్ , ఎగ్జాంస్ గట్రా గురించి. ఈ లోపు ఉన్నపళంగా లేచి చేతికి రంగులు పూసుకొని నా దగ్గరకి వచ్చి….

“హే…నీకు పూస్తా పూస్తా….” అని బెదిరించింది

నేను ఉలిక్కిపడీ లేచి, సుధ ఏమంటుందో వినేలోపే పరుగు లంఘించుకున్నా…మేడ మొత్తం ఒక నాలుగు రౌండ్లు వేశాం, పట్టుకోలేక పోయింది. బక్కగా ఉంటుందిగా చాలా కష్టంగా పెరిగెడుతుంది పాపం. ఈ తంతు అంతా చూస్తున్న అన్నయ్యలు,

“పూయించేసుకో! పూయించేసుకో!!” అని అరుస్తున్నారు.
“నో…నో…” అంటు పరిగెడుతున్నా నేను
“ఆగు ఆగు…ఐపోయావ్ ఇవాళ నా చేతుల్లో” అని నా వెనకాల సుధ

ఆలా తిరిగి తిరిగి అలసిపోతున్నా టైం కి, ఇక మేడ మీద లాభం లేదని కిందకి వచ్చేసి మా గేట్ లోపలికి దూరాను. సుధ కూడా నన్ను తరుముకుంటూ వచ్చింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూశా…మహేష్ కూడా వస్తున్నాడు రంగులు తీసుకొని, చెల్లికి సాయం చేయడానికి కాబోలు.

“అమ్మో! ఇదేంటీ” అనుకుంటూ, మా ఇంటి చుట్టు తిప్పించా వాళ్ళిద్దరిని ఒక రెండు రౌండ్లు. “వీళ్ళకి అలసట రాదా” అనుకున్నా.
ఇక నా వల్ల కాదు అని ఇంట్లోకి దూరి తలుపు గడియ పెట్టేశా….

“ఆ అమ్మా! నా వేళ్ళు….తలుపు తియ్యి…తలుపు తియ్యి….” అని అరుస్తుంది సుధ, మా గుమ్మం బయట నిల్చొని….
“ఏంటి నాటకాలా….నువ్వు వెళ్ళేంత వరకు చచ్చిన తీయను ఫో” అని నేను, గడియ వేసిన తలుపు ఎక్కడ తెరుచుకుంటుందో అని తలుపుకి గట్టిగా ఆనుకొని మరీ, అరుస్తున్నాను.

ఏడుస్తున్నట్టు భలే నటిస్తుంది….నేను మాత్రం తలుపు తీయదలచుకోలేదు….అలా రెండు నిమిషాలు గడిచాయి…బయటే అరుస్తుంది ఇంకా…కాని ఈ సారి ఆ అరుపులతో పాటు వాళ్ళ అమ్మ గారి అరుపులు కూడా వినిపిస్తున్నాయి….
ఏంటా అని తలుపు తీసి చూసే సరికి….సుధని ఎత్తుకొని వాళ్ళ అమ్మ గారు పెరిగెడుతున్నారు. నాకు ఏమైందో అస్సలు అర్థం కాలేదు. నేను కూడా వెనకాలే వెళ్ళాను. కాసేపటికి సుధ వాళ్ళ నాన్న గారు తనని ఎత్తుకొని బయటకి వచ్చారు.

తన చేతి నుంచి ధారగా రక్తం కారుతుంది. తన (బక్క పలచ) వేళ్ళు పచ్చడి కింద నలిగిపోయాయి….నాకు చాలా భయమేసింది…చూడలేకపోయాను. నేను ఏమైందో తెలుసుకునే లోపే తనని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళిపోయారు.నాకేం మాట్లాడాలో తెలియలేదు. హాస్పిటల్ కి వెళ్ళే ముందు, సుధ వాళ్ళ అమ్మ గారు నాకేసి ఒక రకంగా చూశారు. చాల భయమేసింది నాకు.

ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకొన్నాను. గడిచిన పావు గంటలో ఏం జరిగింది అని ఆలోచిస్తుండగా, ఎవరో తలపు కొట్టారు. పోలీసులేమో అనుకున్నా. భయంగానే తలుపు తీశాను. చూస్తే పుష్ప ఆంటీ, ప్రవీణ్ అన్నయ్య వాళ్ళ అమ్మ గారు.

“ఏమి కాదులే, భయపడకు ఊరికే. ఆ అమ్మాయే కదా నువ్వు వద్దు వద్దు అంటున్నా వెంటబండింది…అందుకే అలా జరిగింది..నువ్వు ఫీల్ అవ్వకు” అని దగ్గరకి తీసుకున్నారు.

అప్పటికి కాస్త ధైర్యం వచ్చింది. నా తప్పు లేదులే అనుకున్నా. మధ్యాహ్నం నాన్న వచ్చారు. ఏమి చెప్పలేదు నేను ఆయనకి. కొడతారేమో అని భయం. అన్నం తినేసి ఒకసారి పుష్ప ఆంటీ దగ్గరికి వెళ్ళి అడిగాను, ఎలా ఉంది సుధ కి అని. పన్నెండు కుట్లు వేశారని చెప్పారు ఆవిడ. “అమ్మో” అనుకున్నా. ఆ సాయంత్రమంతా నాలో నేనే ఏదో కుమిలిపోతూ గడిపాను. నాన్నకి చెప్పలేను, అమ్మ ఊళ్ళో లేదు…ఏం చెయ్యాలో తెలియలేదు నాకు.

ఆ రాత్రి ఎప్పుడు తెల్లారుతుందా అని నిద్ర కూడా పోకుండా కూర్చున్నా. పొద్దున్నే నాన్న, అమ్మని తీసుకొని రావడానికి వెళ్తూ నేను కూడా వస్తానేమో అని అడిగారు. వస్తాను అని చెప్పాను. బస్ అనుకున్న టైం కంటే ముందే వచ్చింది. ఇంటికొచ్చేసరికి ఆరయ్యింది. అంతే, మంచం మీద అమ్మ కూర్చోగానే తన వళ్ళో తల పెట్టి ఏకబిగిన ఏడుపు మొదలుపెట్టాను.

“ఎందుకమ్మా, వచ్చేశాగ…ఎందుకు ఆ ఏడుపు” అంటూ నా తల నిమురుతోంది అమ్మ.

నేను ఆపకుండా ఏడుస్తూనే ఉన్నా. ఈ లోపు నాన్న సుధ గురించి చెప్పడం మొదలు పెట్టారు. నేను షాక్ అయ్యాను, ఆయనకి ఎలా తెలుసు ఇదంతా అని. అంతా అయ్యాక చెప్పారు, పుష్ప ఆంటి నిన్నే చెప్పారు అని. తెలిసి కూడా నన్నేమి అనలేదు, నాన్న ఎంత మంచి వారో అనుకున్నా. కాని దుఃఖం ఆగడం లేదు…ఏడుస్తూనే ఉన్నా.

“నీ తప్పు లేనప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు?” సూటిగా అడిగింది అమ్మ
“…”
“చూడూ! ఏదో జరిగిపోయింది, నీ తప్పు లేదు, ఇక మేము చూసుకుంటాములే…నువ్వు అన్ని మర్చిపోయి నార్మల్ గా ఉండు” అని చెప్పింది.

అప్పుడు కొంచెం ఏడుపు తగ్గింది. ఏదో తల మీద భారం దిగిన ఫీలింగ్ కలిగింది నాకు. అయినా దాదాపు రెండేళ్ళ పాటు ఆ సంఘటన నన్ను వెంటాడుతూనే ఉంది. హోలి వస్తే మాత్రం చాలా బాధగా ఉండేది.

ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేనెప్పుడూ హోలి ఆడలేదు. ఇప్పటికీ ప్రతి సంవత్సరం "మార్చి పదిహేడు" వస్తే ఏదో తప్పు చేశాను అన్న గిల్టీ ఫీలింగ్ కలుగుతుంది నాలో.

ఉపసంహారం (ఎపిలాగ్):
తర్వాత, సుధ ఏమైంది: ఆ అమ్మాయికి నలిగింది ఎడమ చేతి వేళ్ళు కాబట్టి చదువుకి ఏమీ ఆటంకం రాలేదు. ఒక నెలలో చెయ్యి నార్మల్ అయిపోయింది. ఇంకో నెల రోజులు వాళ్ళ అమ్మ గారు మా అమ్మతో మాట్లాడలేదు. తర్వాత వాళ్ళు అక్కడ ఖాళీ చేసి, వేరే ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ మాత్రం ఆవిడ అమ్మకి చెప్పి వెళ్ళింది. అంతే. నేను, సుధ మాత్రం ఆ హోలీ తర్వాత ఎప్పుడూ మాట్లాడుకోలేదు. కనీసం చూస్తే, నవ్వుతో పలకరించుకోనూ లేదు…మరి, ఇప్పుడు ఎక్కడుందో ఏం చేస్తుందో…!!

కృతజ్ఞతలు:
సతీష్ & నచకి

Thursday, February 26, 2009

నా మొదటి తెలుగు బ్లాగు

ఎంతో కాలంగా తెలుగులో ఒక బ్లాగు మొదలు పెట్టాలని అనుకుంటున్నాను. ఇన్నాళ్ళకి ఆ కోరిక ఈ "వానవిల్లు" రూపం దాల్చింది :)
నేను ఆలోచించే ఎన్నో విషయాలకి అక్షర రూపమే ఈ "వానవిల్లు". చదివి మీ సలహాలు, సూచనులు ఇస్తారని ఆశిస్తున్నాను :)

కృతజ్ఞతలు : గురువు గారు శ్రీ "సిరివెన్నెల" సీతారామ శాస్త్రి గారు
వానవిల్లు : హరివిల్లు అని అర్థం (వేటూరి గారి ప్రయోగం, నాకు ఈ పదాన్ని పరిచయం చేసింది సిరివెన్నెల గారు)
ఎన్నో రంగుల తెల్ల కిరణం : సీతారామ శాస్త్రి గారి కథ పేరు